చెన్నయ్ బ్యూటీ సమంతా మాటలు బాగా నేర్చేసింది. అసలు మాటల మాంత్రికుడిగా పేరు తెచ్చుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా ఆమె ముందు నోరు తేలేస్తున్నాడట. ఈ విషయాన్ని తనే చెబుతున్నాడు. తాజాగా వీరిద్దరూ కలిసి ఓ టీవీ లైవ్ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సమంతా మాట తీరు, మాటల గారడీ గురించి మన దర్శక రచయిత బయటపెట్టాడు.
వాళ్ళ మీదా వీళ్ళ మీదా సెట్లో సమంతా వేసే సెటైర్లను తట్టుకోవడం కష్టంగా వుందని కామెంట్ చేశాడు. ఆమె వేసే సెటైర్లకు మైండ్ బ్లాక్ అవుతుందని కూడా చెప్పాడు. సెట్లో అందర్నీ నవ్విస్తూ ఇలా తన చమత్కారంతో పంచ్ డైలాగులు కూడా వదులుతుందని అన్నాడు. త్రివిక్రమ్ పొగడ్తలకి ముసిముసిగా నవ్వుతూనే, "మీరేంటండీ బాబూ ... ఇలా అన్నీ బయటపెట్టేస్తున్నారు?" అంటూ సమంతా వారించింది. ఏమైనా త్రివిక్రమ్ మనసు మాత్రం ఈ చిన్నది దోచుకుంది!